ప్రియ కారుమంచి // అక్షరం నాకు అమ్మ
నా అక్షరాలకు 'గాయాలు ఎక్కువ' !
అందుకే నా అక్షరాలు ....
ఆ గాయాల నుంచి స్రవించిన చీకట్లతో తడిచి
ధిక్కార స్వరాలై పోటెత్తి ప్రవహిస్తుంటాయి !!
నా అక్షరాలకు 'ఆత్మవిశ్వాసం' ఎక్కువ ...
అందుకే ఆత్మవిశ్వాసాన్ని చిరినగవుగా ధరించి
మిలమిలా మెరిసి పోతుంటాయి !!
నా అక్షరాలకు 'ఆత్మాభిమానం' ఎక్కువ .....
అందుకే ఆత్మాభిమానాన్ని మణికిరీటంగా ధరించి
సగర్వంగా తలెత్తుకుని ధగధగ లాడుతుంటాయి !!
నా అక్షరాలకు అభిమానం ఎక్కువ ...
అందుకే అభిమానంతో జన హృదయ తంత్రులను మీటుతూ
మృదుమధురంగా సరిగమలు పలికిస్తాయి !!
నా అక్షరాలకు మనుషుల పట్ల మమతానురాగాలు ఎక్కువ ...
అందుకే మమతానురాగాలు పంచుతూ, ప్రేమ పరిమళాలు అద్దుకుని
గలగలమని నవ్వుతూ మానవతా తీరాలలో విహరిస్తుంటాయి !!
నా అక్షరాలకు సమాజం పట్ల బాధ్యత ఎక్కువ ....
అందుకే ధర్మం దారితప్పిన చోట , వాత్సల్యం వరస మారిన చోటా చిరు చురకలవుతాయి
మరీ అవసరమైతే పిడుగుపాట్లూ అవుతాయి
మళ్ళి చెప్తున్నాను
అక్షరం నాకు ' అమ్మ'
అమ్మతనం ఒక వెచ్చని కన్నీటి చెమ్మ !!
.........................మీ ప్రియా కారుమంచి ........
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.