ప్రియ కారుమంచి // నేల బిడ్డ
దుక్కిదున్ని, విత్తునాటి వర్షపు చినుకు కోసం ఆశగా చూసే రైతన్నా
ఆరుగాలం కష్టపడ్డా గిట్టుబాటు ధర వస్తుందని, నీకేది భరోసా ..
కష్టానికి ఫలితం వస్తుందో రాదో తెలియకుండా కష్టపడే కార్మికుడివి నీవు
గంట కూలికి ఇంత రేటు
రోజుకూలికి అంత మొత్తం
సూటుబూటు బాబులకేమో నెల ముందే చెక్కులు
తిండిపెట్టి కడుపునింపే నీకేమో ఆకలి నేలచూపులు
విత్తునాటిన దగ్గర నుంచీ అన్నీ ఎదురుచూపులే
సర్కారోడు కరెంట్ ఇవ్వను పొమ్మంటాడు
బోరుచూస్తే నీరులేదు ...పైకిచూస్తే చినుకురాలదు
కన్నుమూస్తే కాబోలి వాడు ...పక్కకెళ్తే పురుగుమందుల డీలరుగాడు
కన్నతల్లికి లెక్ఖ కట్టి ముసలి తనపు ఇళ్ళకు అప్పచెప్తున్న హైటెక్కు గాళ్ళకేం తెలుసు
నీకు కన్నతల్లిని మించిన తల్లి ఈ నేలతల్లని,
నీ కన్నీళ్లను తనలో ఇంకించుకుని నిన్ను ఓదార్చే కన్నతల్లని
పంట పండకా ,పెరిగిన అప్పు కట్టలేకా
ఆత్మాభిమానం చంపుకోలేకా , దళారీల్లా ఇన్సాల్వెన్సి దారి పట్టలేకా
చేతిలోఉన్న పురుగుమందు డబ్బావంకా , కన్నబిడ్డల వంకా
మార్చి మార్చి చూసే నీ నిస్సహాయత ఏ సర్కారోడికి అర్ధమైందన్నా
నీ శవాన్ని చూసి, వొళ్ళు బలిసి ఆత్మహత్య చేసుకున్నావంటే
కొడవలి చేతబూని ఉన్న ఓ రైతన్నా కోసేందుకు ఎలాగూ పంట లేదు
అన్నవాడి నాలుక తెగ్గోసే సత్తువలేక బక్కచిక్కి పోయావు కాదన్నా రైతన్నా
ఆలిబంగారం తాకట్టుపెట్టి తెచ్చిన మల్టీ నేషనోడి విత్తనం మొలకెత్తిందా
కర్మగాలి పంట కళ కళ లాడిందా ,
నెత్తిమీద యముడై కూర్చున్న పురుగుమందుల కంపెనివాడు
అన్నీ దాటి గింజ చేతికొచ్చిందా
దారికాచి దోచుకునే దళారి వాడు
గుమ్మం ముందు కాచుకు కూర్చున్న కాబోలివాడు
నీ కష్టం కళ్ళముందు కొచ్చేటప్పటికి
వాళ్ళ పెళ్ళాల చేతులకేమో వజ్రాలగాజులు వెలిస్తే
నీ కట్టుకున్న దాని పూస్తే మాయమవుతుందేంటన్నా రైతన్నా !!
7/ 12/ 2012
.....................

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.