ప్రియ కారుమంచి // నిశ్శబ్ద గానం .....
నా అంతరాంతరాలలో నిండి ఉన్నది నీవే
నా మూలం
నా గమనం
నా గమ్యం
నా ఆది అంతం నీవే
నీవు నడిచి చూపిన బాట తప్ప
ఈ లోకపు లౌక్యం తెలియదు నాకు
నీవు నేర్పిన అక్షరాలు తప్పా
ఈ ఆడంబరాల అనురాగ,మమకారాలు తెలియవు నాకు
నీ ఆలోచనల పరంపర కొనసాగింపు తప్ప
ఆస్థుల్లో హక్కుల గురించి తెలియదు నాకు
నీ భావావేశాల రంగరింపు రక్తం తప్ప
ఏ రక్త సంబంధాలు మిగలలేదు నాకు
నువ్వు చెప్పినట్టు , నీవు నాకు పదే పదే చెప్పినట్టు
ఇక్కడ స్వేచ్చాగాలులు లేవు
బంధించిన మనసుల ఆక్రందనలు తప్ప
ఇక్కడ కమ్మని కోయిల స్వరాలు లేవు
నిజాన్ని ఏకాకిని చేసే కాకి కూతలు తప్ప
ఇక్కడ వసంత మాసపు అందాలు లేవు
కుళ్ళిన మనసుల కంపు తప్పా
నీవు కలలు కన్న సమసమాజపు జాడ లేదు
కులాల కుమ్ములాటలు తప్ప
క్షమించు .....
నీ భావాలు కొనసాగించాలంటే నా మనసంతా గాయలవుతున్నాయి
ఏకాకిని చేసి నన్ను ఎలా తరుముతుందో చూడు ఈ ఆబద్ధపు సమాజం ..........
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.