Tuesday, 29 September 2015

రాతి మనసు ~

రాతి మనసు ~
చూడు, అందరూ నన్నేమంటున్నారో!
పలకరింపుకి ప్రతిస్పందించని రాతి మనిషి అంటున్నారు ..
అది నాతప్పా !
ఎవరి పలకరింపుకూ ఎదురుచూడనంత స్థైర్యాన్ని ఇచ్చింది నువ్వు కదూ !
ఏం చేస్తున్నావ్, తిన్నావా అనే పొడి పొడి పలకరింపులు నన్నేమీ ఉద్ధరించవుగా !
విధి రాతను ఎదిరించటం నేర్పింది నువ్వనీ,
కష్టాన్ని సైతం ఇష్టంగా మార్చే రసనాదాన్ని నేర్పింది నువ్వని ఎలాచెప్పను !
నా ఆనందాన్ని కోరుకుంటున్నాం అనేవాళ్ళకు ఎలా తెలుస్తుంది
నేను కోల్పోయిన ప్రపంచాన్ని నా కిటికీ దగ్గరకు చేర్చింది నువ్వేనని
ఉద్విగ్న , ఉద్వేగ క్షణాలలో అందరికి దేవుడు గుర్తొస్తాడు
నాకు మాత్రం నువ్వు గుర్తోస్తావని నీక్కూడా తెలియదు కదా !
ప్రపంచం నా కన్నీటి కోసం ఎదురుచుసినప్పుడు
నా కనురెప్పలకు కాపలాగా ఉన్నది నువ్వేనని నీకు తెలుసా !
తెలియనితనంతో తప్పటడుగులు వేసినప్పుడు శిక్షిస్తావ్ నన్ను మాట్లాడకుండా
మరుక్షణం బిడ్డని దండించిన తల్లిలా బాధతో రోదిస్తావని నాకు తెలుసు
పలకరింపు మనస్సునుంచి మనస్సుకు సోకే విద్యుత్తని
ఫార్మాలిటీస్ పలకరింపులకు అది అతీతమని
వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది నేస్తం ....

నీకోక లేఖ

ప్రియ కారుమంచి / నీకోక లేఖ ..
......................................
ఎలా ఉన్నావు అని అడిగావు నువ్వు
ఏం చెప్పనూ ....!!
పెద్దగా మార్పుమీ లేదు
తడి తడి నేలతో ముచ్చట్లు
నగ్నపాదాలు పచ్చికతో ఆడే దోబూచులాటలు
అపురూపంగా దోసిట్లో నింపుకున్న విరజాజులు
వేళ్ళ సందుల నుంచి జారిపోతుంటే,
దిగులుగా వెనక్కు వెనక్కు చూసాను వాటి కోసమూ
ఆ వంకతో వీడ్కోలైనా చెప్పకుండా వెళ్ళిపోతున్న నీకోసం
నీ జ్ఞాపకాలు
జాజి పరిమళంలా నన్ను మత్తెక్కిస్తూనే ఉంటాయి
ఇప్పటీకీ ఎప్పటికీనూ.......................
ఆరోజు నువ్వు ఇచ్చి వెళ్లిన ఖడ్గపు మెరుపు
చీకటిలో చిరుదివ్వెలా ఇంకా దారి చూపుతూనే ఉంది.
అప్పుడు మన ముచ్చట్లు విని మురిసిన జంట తరువుల నీడ
ఇప్పుడు మౌనంగా నిట్టూర్చే నన్ను చూసి వెక్కిరిస్తుంది .
మరి నువ్వు అడుగుతావు ఇక
నువ్వు ఎలా ఉన్నావూ అని
ఏం చెప్పగలను నేను
పెద్దగా మార్పేమీ లేదని తప్ప...

....నీకు తెలుసుగా ...!

ప్రియ కారుమంచి ......నీకు తెలుసుగా ...!
నీకు తెలుసుగా ....!
నాకు సముద్రమంటే భయమని
కానీ దూరంగా నిలుచుని,
రాయేస్తే రింగు రింగుమని తిరిగే నీళ్ళను చూడటం భలే ఉంటుంది
నేను సృష్టించిన అలజడి కన్నార్పకుండా చూడటం భలే సరదా..!!
సముద్రం నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ,
అచ్చం ఈ మనుషులు వైరుధ్య భావాలు చూసి గగ్గోలు ఎత్తినట్టు
సముద్రం కూడా చిన్న రాయికే భయపడి సుడులు తిరుగుతుంది
మధ్యమధ్యలో ఉన్మాదపు అలలు నాపైకి ఎగిసెగిసి పడతాయి కూడా
నీకు తెలుసుగా ....!
నాకు సముద్రాన్ని చూడటమే ఇష్టం
తాకడం ఇష్టం ఉండదని ...!
ఎంతసేపు ఈ గంభీరం నటించే సముద్రాన్ని చూడనూ ....
విసుగొస్తుంది నాకు ....
అందుకే ,అందుకే మెల్లగా వచ్చి నీ గది తలుపు తడతాను
నువ్వు ఉండవని నాకు తెలుసు ..
కానీ నువ్వు నాకోసం చల్లిపోయిన అక్షరాలు గుభాలిస్తూ
స్వాగతం అంటూ చిరునవ్వులు చిలకరిస్తాయి
అలానే గోడకి చేరగిలబడి ఎంత సేపు కూర్చుంటానో
గదంతా '' మనిషి వాసన''
రాలిపడిన ఒక్కోసుమ రేకునూ ఏరుకుంటూ
ఒకచోట పేర్చుకుంటూ
మళ్ళీ చెరిపేస్తూ
అలా పసిదానిలా మారిపోయి ఎంతసేపు గడిపెస్తానో ..!
మళ్ళీ సముద్రం గుర్తొస్తుంది , పాపం అలలు కూడా
వాటి విషపు నురగలతో నన్ను తడిపెయ్యలని వాటికెంత ఆరాటమో కదా ..!
వాటిని , వాటి పిచ్చి కోరికను చూస్తే జాలేస్తుంది ..
నువ్వు నాకోసం వదిలివెళ్ళిన స్నేహ సుమాలను కొన్ని దోసిట్లో పోసుకుని
వాటితో కబుర్లాడుతూ మళ్ళీ సముద్రం దగ్గరకు వస్తాను
ఇదిగో మా పరిమళం అద్దిన పూలు మీకూ కాసిని ఇస్తున్నా
ప్రక్షాళన కండి అంటూ బుజ్జగించి సముద్రంపైకి విసిరేస్తానా ..!
మళ్ళీ దానికీ వాటిని చూసినా అలజడే ....పిచ్చి సముద్రం ....
అప్పుడు నాకు మన చలం గుర్తొస్తాడు
వేయి కాగడాలు వెలిగించి విసిరినా ఆరిపోతాయి
అంత మూర్ఖం ఈ మనుషులకు అంటూ ...నిజమే కదా ..!
అందుకే నువ్వు / నేను కాగడాలు విసరొద్దు
జ్ఞానాన్ని పూలగా మార్చి వెలుగులు నింపేద్దాం.
.............సరేనా ....కన్నా .....
.......................................ప్రియ కారుమంచి...

నాదొక అందమైన విషాద పుస్తకం __________________________

నాదొక అందమైన విషాద పుస్తకం
__________________________
నెమలీకలుగా నే దాచుకున్న
మధురోహాల జ్ఞాపకాలు 
గులాబీ రేకుల పరిమళాలై
ముంచెత్తే మది భావాలూ
తొలిపొద్దు కిరణాలను చూసి
ఎగసిపడే చిరునవ్వుల కెరటాలు
సంధ్య చీకట్లు ముసురుకు
నిరసనగా తెలిపే చిరుకోపాలు
అప్పుడప్పుడూ
నీలాల మీనాల నుంచి
కురిసే వాన చినుకులు
మనసు మబ్బుతెరలూ
శిధిల కోటలో మౌన నిశీధిలో
పగిలిన కిటికీ అద్దంలోనుంచి
లోకాన్ని చూస్తూ కలతపడుతూ
ఇలా నాపాటికి నే నిలుచుంటే
ఇంకా రాళ్ళేయాలని
గునపాలతో గుచ్చాలని
గాయపరచాలని
ఎందుకీ రాతితనం
ఇక్కడ
మాటకి దిక్కులేని వాళ్లకు
మనసులు పంచుకునే
విశాలతత్వం అసలే లేదు
బహుమతిగా రాసిన వెండి కంచాలు
మనసు సందు నుంచి అసలే దొర్లిరావు
ఎందుకంటే ఇది జీవితం
మరి అసలైన జీవితం ...
ఇక్కడ అంతా నిజమే ..

~నీ కోసం ~

~నీ కోసం ~
ఇంకా విడిపోని
చీకటి పరదాలు చీల్చుకుని
వేకువ వే వేల వర్ణాల పూదోట మీదగా 
నీగుండే సవ్వడి మోసుకొస్తూ
అలలా తాకిన 'ఓ ' ఆలాపన
ఫిల్టర్ కాఫీ పరిమళాలతో
నీ మాటల మాధుర్యం కలిసి
మనసుని మత్తెక్కిస్తూ
సీతాకోక చిలక రెక్కలను స్ప్రుజి౦చిన
తెమ్మెర సిగ్గుని గానం చేస్తూ ఓ కోయిల సందేశం
నీ నవ్వుల గలగలలు
మన కలల ఊసులూ కలిసి
రాత్రి చంద్రుని వెన్నెల మరకలుగా, సరిగమలుగా మారి
నా యెదలో మువ్వలు కట్టి సందడి చేస్తున్నాయి
ప్రపంచాన్నంతా ఒక పక్కకి జరిపేసి
నువ్వూ నేనూ ఒక అంచున కూర్చుని మాట్లాడుకుంటున్నట్టూ
దృశ్యాలన్నీ అదృశ్యమైపోయి
మనమే ఏకైక దృశ్యంగా మిగిలినట్లూ అనిపిస్తుంది .....
లోకంలో పరిమళాలన్నీ రెండు పూలలో ఇమిడి పోతే
ఆ పూలలోకి నువ్వూ నేను నడిచెళ్ళినట్లనిపిస్తుంది..
మనం ఎవరి నుంచి ఎవరం, ఏమీ కోరుకోలేదని తెలిసీ
ఈ సృష్టి మనతో స్నేహం కోరుకున్నట్లుగా ఉంది ......
______ప్రియ కారుమంచి ....

మనుషుల్లో ఏముంది ?? ___________________

మనుషుల్లో ఏముంది ??
_______________________
కులం వాసన / మతం వాసన
ఆడ వాసన / మగ వాసన 
పేద వాసన / ధనిక వాసన
ఆడంబరాల వాసన / అహంకారపు వాసన
భక్తి వాసన / భయం వాసన
అని ఆడుకుంటున్న బొమ్మలని అవతలకు విసిరేసీ
పసిదానిలా పచ్చపచ్చని పూదోటల్లో పరిమాళాలు ఆస్వాదిస్తున్ననాకు
రా !
నీకోటి చూపిస్తా అంటూ చెయ్యిపట్టి తీసుకెళ్ళి
తోలకరి వానకు తడిచిన మట్టి
దోసిలి పట్టి చూపించావు
అప్పుడు నువ్వన్నావు గుర్తుందా !
చూడు మట్టి వాసన
మన పూర్వీకుల వాసన
మనిషి వాసన
మానవత్వపు వాసన
చనుబాలు ఇంకిన వాసన
నీ వాసన / నావాసన
మరి ఇప్పుడు చెప్పు ''నేను అడుగుతున్నా''
మట్టిలో కలిసాకే మనిషి వాసన వస్తుందా ?

నాకు ‪#‎నచ్చలేదు‬

నాకు ‪#‎నచ్చలేదు‬
నేను పుట్టకముందే నామొహాన ఒక మతం,
అది ప్రతిపాదించిన ఒక కులం స్టాంప్ పచ్చ బొట్టు వెయ్యడం
నాకు నచ్చలేదు
ఆడదానికి మాత్రమె శీలం ఉంటుంది
అది అగ్నిప్రవేశంతో నిరూపించుకోవాలనడం
మరి తనని అనుమానించిన మగవాడిని
నీ శీలం నువ్వూ నిరూపించుకో
నాకూ నీ మీద అనుమానంగా ఉంది
అది తీర్చే బాద్యత నీదే
అని అడగక పోవడం నాకు నచ్చ లేదు..
నాకు నచ్చ లేదు
అమ్మా పట్టి తెచ్చాం అంటే ,
ఏం తెచ్చారో కూడా చూడకుండా, పంచుకు తినండ్రా నాయనా అనడమే ఆలస్యం
పరమానందయ్య శిష్యులు ఒక ఆడదాని మీద ఎగబడటం ..
నన్నెలా పంచుకుంటారు 'నేను మనిషిని ' అని అడ్డగించక పోగా ,
పండుని తిన్నట్టు పంచుకు తింటుంటే తలదించుకుని పడి ఉండటం నాకు నచ్చ లేదు ..
నాకు నచ్చ లేదు
మోహించా , ప్రేమించా అంటే ముక్కూ చెవులూ కోయడం
ఆ తరవాత ఆమె బ్రతుకంతా పడిన మానసిక వేదన , రోదన నాకు నచ్చ లేదు
ఒక ఆడది భర్త లేకపోతే ఏం చేసిందీ అన్న ప్రశ్న ,
ఆమె శీలం మాత్రమె ఆమె వ్యక్తిత్వ్వనికి తూనిక రాయి అయినట్టు
ఆమె మేము ప్రతిపాదించిన తప్పులు ఏమీ చెయ్యలేదు అని చెప్పటం కోసం
ఆమెను ఏళ్లకు యేళ్ళు నిద్ర పుచ్చటం నాకు నచ్చ లేదు ...
నా కాలికి గజ్జే కట్టి వేరొకరి కనుసన్నలలో నా ఉనికి తిరుగాడటం
చేతికి గాజుల మలారాలు తగిలించుకుని నీ చెంతే ఉన్నా అంటూ
ప్రతి క్షణం నిరూపించుకోవాల్సి రావడం నాకు నచ్చలే...... దు ..
తలనొక చెట్టు చేసి పువ్వులు మోలిపించుకోవడం
మెడకో బిళ్ళ వేలాడేసుకుని నేను ఇంకొకరి ఆస్తి అని చాటుకోవడం
వేళ్ళకు నొప్పి పుడుతున్నా ఆచారం అంటూ మెట్టెలు పెట్టి ,
సైన్స్ ని ఈ మూడ విశ్వాసాలకు ముడిపెట్టి తిక్కలు లెక్కలు చెప్పే పంతుళ్ళు ను
నిస్సహాయంగా భరిస్తూ ఉండాల్సి రావడం నాకు నచ్చలేదు
సౌందర్యం , ఆభరణం ,అలంకారం లేకపోతే నీ మొహ౦
మరి నాకూ నచ్చదు పొమ్మని చెప్పలేక పోవడం అసలే నచ్చలేదు
కన్యా దానం అంటూ , నన్ను దానం చేసే హక్కు నీకు లేదని అరిచి చెప్పలేకపోవడం
''నేను వస్తువా '' నువ్వు పుచ్చుకోవడానికి చచ్చువేధవా
అని ఆడపిల్లలు అనలేకపోవడం నాకు నచ్చలేదు ..
నా స్నేహితులు ఊరి బయట ఉండటం నచ్చ లేదు
నా దోస్తుల చేతిలో చెయ్యేసి స్వేచ్చగా వెళ్ళలేని
డివైన్ ( నేను అనుకోవడం లేదు ) ప్ర దేశాలు నాకు నచ్చ లేదు
పందులను కనమన్నట్టు పది మంది పిల్లలను కనమంటూ
ఇలా అయితేనే ఉండు,మేము చెప్పినట్టే విను లేదంటే దేశం విడిచి పో
అని మాటిమాటికీ అనే బూడిద బాబాలు నచ్చ లేదు
కాల్బుర్గిని అన్యాయంగా చంపడం నాకు నచ్చ లేదు
మత ఘర్షణలను భద్రతకు ముడిపెట్టి, మనుషులను చంపడం నాకు నచ్చ లేదు
వీటి గురించి నేను మాట్లాడితే మనోభావాలు దెబ్బ తీసుకు చస్తున్నాం
అంటూ బెదిరించడం నాకు నచ్చ లేదు..
ఇవన్నీ ఆలోచించడం ఎందుకూ ?
చాప కింద నీరు చాప కిందే దాపెట్టి ముప్పోటలా సాపాటు మెక్కి
జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చెయ్యక అని చెప్పే కొవ్వొత్తి గాళ్ళ
మద్య బ్రతకాల్సి రావడం అస్సలు నచ్చటం లేదు ...

Monday, 28 September 2015

ఓ ప్రియా

ఓ ప్రియా
నీ కోసం నేను
అకాశం నుంచో
శూన్యం నుంచో
సున్ని పిండి నలుగులోనో
రావాలా? రాలి పడాలా?!!
నువ్వు పుట్టిన దగ్గిర
నుంచీ నీ శ్వాసలొ శ్వాసనై
నీ అణువణువునా ప్రాణమై గానమై
ప్రతిద్వనిస్తూ ఉంటే
నన్ను గుర్తించడానికి
నీకు శాస్త్రమూ అస్త్రమో కావాలా
సాటి మనిషి నమ్మకంలో ఉన్నా
సహయం చెసే ప్రతీ హృదయంలో కన్నా
అంతటా నెనే
అన్నీ నెనే
అన్నితా నెనే
మనసున్న ప్రతీ మనిషిలో
పశువుల్లో శిశువుల్లో
గానంలో గాత్రంల్లో
కంబాల్లో స్తంభాల్లో
గగనాల్లొ మెఘాల్లో
పారే నదుల్లొ
దూకే జలపాతాల్లో
రాయల్లొ రప్పల్లో
కృతుల్లో ప్రకృతుల్లో
నీ ఉనికిలో ఉనికినైనా నన్ను
నన్ను నమ్ముకున్న వారి భావాలను
నీ శ్వాసను స్వెచ్హను శంకిస్తే
వెటకారంతో గొంతు నొక్కి
వెక్కిరంతగా ముక్కు మూసుకుంటే
నిర్జీవమవయ్యెది
నా నువ్వే ప్రియా!
నీ నెనే ప్రియా!!__________ Bobby
అవును....
నువ్వు నా 'అపరిచితుడివి'
నన్ను ధ్వంసం చేయ వచ్చిన 'కంసుడివి'
నన్ను చంపడానికొచ్చిన 'కాల యముడివి'....___ప్రియ

ఓ ఉదయపు విషాదం _______________

ఓ ఉదయపు విషాదం
_______________
ఓ ఉదయం
సూరీడు రాకతో 
గువ్వ పిల్లల గోలతో
నిద్ర లేచీ,
అలా తలుపు తీసానో లేదో
విషాదంగా నవ్వుతూ
ఎదురుపడిందో దిగులు మేఘం
రాత్రి చుక్కల్లా
నువ్వు వచ్చి వెళ్ళిన గుర్తుగా !
లానంతా రాలిపడ్డాయి
నువ్వు పాడిన విరహగీతాలు
జీవితం విలువ గురించి
వాటికీ లెక్చర్లు ఇచ్చావు గావును
నీ మాటల భారం మోస్తూ
మొక్కలన్నీ తలలు వాల్చేశాయి
సూరీడు పలకరించినా
ఇంకా వికసించని పువ్వులు
మొగ్గలుగానే ముడుచుకు పోయాయి
భయంతో బిక్క చచ్చి పోయాయి
ఎందుకూ ఊరికే గోడలెక్కి
తెలుపు నలుపు నీడల్లాంటి
నీ నీతి సూత్రాల గురించి
గోలగోలగా అరుస్తావు
ఈ నీతి లేని సంఘానికి
ధైర్యం లేని జనానికి
నువ్వు విరివిగా రాసి పడేసే
యోగ్యతా పత్రాలు అర్ధం కావు
ముందు మనుషులందరూ ఒక్కటే అనీ ,
నువ్వు ఒప్పుకో
తరవాత , అ తరవాత
జీవితపు విలువ గురించి మాట్లాడదాం
సరేనా !!

LIFE IS BEAUTIFUL

అసలు ఎందుకు వచ్చావు
ఎందుకు పిచ్చి ప్రియా అంటూ అల్లరి చేసావు

LIFE IS BEAUTIFUL

LIFE IS BEAUTIFUL 
అంటూగొంతు తెగేలా ఎందుకు అరిచావ్
ప్రియా
ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోక౦టూ
పదే పదే వెంట పడి ఎందుకు చెప్పావు
ఇన్ని పాటలు పోగేసి నాకిచ్చిసి
వాటిలో నేను ఉన్నా అని చెప్పకు ప్లీజ్
ఇప్పుడు నిజంగానే
తోటలో సంపెంగలు ఏడుస్తున్నాయి
మల్లెలూ , గులాబీలూ వాడి పోతున్నాయి
వర్షం బిక్క చచ్చి కురవకుండా నిలుచుంది
దుఖంగా ఉందిరా
చాలా దుఃఖంగా ఉంది నాకు
నువ్వు రా !
పిచ్చి ప్రియా ఏడవకు అని చెప్పు
ఎవ్వరితో పంచుకోను నేను
ఇక్కడ నాలుగు అక్షరాలు రాలిస్తే తీరేదా
నొప్పిగా ఉంది కదా
కత్తులూ , సూదులతో కూడా
చిరునవ్వుతో చెప్తూ ఉండి ఉంటావు
మా ప్రియకి మాటలే కత్తులు
వాటి ముందు మీరు దిగ దుడుపు
అని కవ్విస్తూ ఉండి ఉంటావ్ కదా !
నీచేతిలో చెయ్యేసి
నీకేం కాదు
నీకేం కాదు
నీకేం కాదు
నీకేం కాద౦టూ
ధైర్యం ఇవ్వాలని ఉందిరా
చేరలేని దూరం
నిస్సహాయమూ
ఇంత దారుణంగా ఉంటుందా !
నీకేం కాదు , నీకేం కాదు ..
ఇంకెప్పుడూ దేవుడు లేడని
నీకు వినిపించేలా అనను
నీకోసం రోజు కవితలు రాస్తా
మరి నువ్వు వచ్చేయి ప్లీజ్
నువ్వు వచ్చేయి రా ..._________
frown emoticon............frown emoticon...........frown emoticon.

పొగడపూల వర్షం.

పొగడపూల వర్షం.

నా నీలి మేఘ సౌధంలోకి 
ఎక్కడినుంచో ఎగిరొచ్చి౦దొక నెమలీక
చల్ల గాలీ 
వెండి వెన్నెల 
ఒక్కటై కలిసి 
మనసంతా
పొగడపూల వర్షం..__ప్రియ .

~పొద్దు వాలిపోతుంది.~

~పొద్దు వాలిపోతుంది.~
మళ్ళీ వస్తానని
చెప్పెళ్ళిన వెన్నెల
ఇంకా రానే లేదు
గూళ్ళు చేరుకున్న పక్షులనూ
కిలకిలాడుతున్న పిల్లలనూ
కాసేపు ప్రేమగా చూసింది తను
ఇంతలో
ఎక్కడినుంచో ఎగిరొచ్చి౦దొక నెమలీక
మనసులోకి అల్లరిచేస్తూ
వెండి వెన్నెల నవ్వుల కోసం
పూల వెలుగులను గుప్పెట పట్టీ
అద్దాల కిటికీ నుండి నిశితంగా
నిశీధిలోవెతుకుతూ ఆమె కాటుక కళ్ళు
ఆరుబయట పరుచుకుంటున్న 'చీకటి'
పరదాలు దాటుకొచ్చి
గుండెలో అలజడిరేపుతుందేమో
ఆల్చిప్పల్లాంటి కళ్ళలో కదలాడుతున్న దిగులు
మరీ,
నువ్వూ వింటున్నావా దూరంగా
శీతాకాలపు ఒంటరి కోయిల ' ఆలాపన'
వేకువ మయూఖ శింజనుల మువ్వల సవ్వడి
కార్మబ్బుల రాకకై తోటలో వంటరిగా ఎదురు చూస్తూ ఓ మయూరం
మరి నాలుగు సందేశాల వర్షపు చినుకులు ప్రేమగా రాల్చిపో 

సరేనా ....!

ప్రియ / నీ కోసం 2

_____________
నీతో కలిసీ, వెలుగు నీడల సంగమ స్థలిలో
భానుడి స్పర్శ కై ఆరాటపడే పూల సౌందర్యాన్ని చూడాలని
ఆకుల అంచున మెరిసే మంచు ధాన్యాలను ఏరుకోవాలని
ఆహా !..ఏం లేదూ !
అలా కాఫీ తాగుతూ మౌనంగా
తూర్పుకొండలమద్య దోబూచులాడే దినకరుడికి
రారమ్మని చిరునవ్వుతో స్వాగతం పలకాలని
ఇక సాయం సంధ్యలో
ప్రేయశి బుగ్గల సిగ్గుతో ఎర్రబారిన సూరీడికి
మళ్ళీ రేపోస్తావు కదా అంటూ అల్లరిగా వీడ్కోలు చెప్పాలని
నింగీ నేలా తాకే ముని మాపు వేళలో
సంధ్య చీకట్లు ముసిరే వేళ జలతారు వెన్నెలలో తడుస్తూ
నీ కళ్ళలో నా నవ్వుల వెలుగులు చూసుకోవాలని
అలా కాసేపు ఊరికే
ఇద్దరు మనుషులు
అచ్చంగా ఇద్ద్దరు మనుషులు
మాట్లాడుకున్నట్టు రికామీగా నాలుగు మాటలు
జీవితం గురించి
గమనం గురించి
గమ్యం గురించి
నువ్వు చెప్తుంటే వినాలని
స్నేహం గురించి
ప్రేమ గురించి
బంధం గురించి
నీతో వాదించి గెలవాలని
నీ పక్కనే కాసేపు కూర్చోవాలని
నా బోలెడు కలలు నీ దోసిట్లో పోయాలని
ఇలా ఇంకా ఏవేవో ..
నాకు తెలుసు
ఇది ఎప్పటికీ పూర్తి కాని కవితని
అయినా రాస్తూనే ఉంటా
నీ కోసం......................