Thursday, 8 September 2016

ఈ రోజెందుకో
చల్లచల్లని ఉదయాన
గుట్టమీది సూరీడు
రాత్రిని తలచుకుని 
ఎలా నవ్వుతున్నడో
చూడు
అతను రాసిన అక్షరాలు
నక్షత్రాలై పూసినట్టు
చిక్కగా అల్లుకున్న
చమేలి పందిరి
నీడలో
ఒక చంద్రకాంత శిల
ఎదురుచూస్తుంది ఎవరికోసమో
ఓ మూలగా శిల్పశాలలో నిలబడి
ఒంటరిగా
అగ్నిపూల చెట్టుకింద
జీవన సౌగంధికా జలపాతాలలో స్నానిస్తూ
ధ్యానిస్తూ , సీతాకోక రెక్కలపై
ఏకాంత స్త్రీ హృదయాన్ని రచిస్తూ
ఈ రోజెందుకో
సూరీడు ప్రొద్దుటే
నవ్వుతూ పలకరించాడు
~ తన అక్షరాలు ~
పచ్చని కొండ శిఖరంపై వాలి
ఆటలాడుకునే నిండు మేఘాలు
విప్పపూల చెట్ల మీద వాలే
రంగు రంగుల సీతాకోక చిలుకలు
బెంగతో ముడుచుకుని శూన్యమైనప్పుడు
నా తలపై మృదువుగా తట్టి ఓదార్చే చేతివేళ్ళు
పిడికెడు ఆత్మీయతను పోదువుకుని
రాగరంజిత రస గీతాలను వినిపించే గుండెచప్పుళ్ళవి
దృఢత్వాన్ని సంతరించుకున్న మంచుబిందువులూ
జలపాతాలలో రాళ్ళని తాకి చిట్లిన చినుకులు
నాచుట్టూ అక్షరాలై విరబూస్తాయి
ఒక్కోసారి అవి '
నెమ్మదిగా ప్రవహించే నదిలో కొట్టుకునే చేపపిల్లలు
ఇంకోసారి
లేత చీకట్లలో వెలుగులు చిమ్మే మిణుగురులు
తన అక్షరాలు
అచ్చం తనలాగే
ఎప్పుడూ మట్టి వాసన వేస్తుంటాయి..
జీవితాలను గానం చేస్తుంటాయి ..
~ సాయంత్రం ~
వస్తువులన్నీ ఎక్కడివక్కడ శ్రద్దగా సర్దిపెట్టి ,
గాజుగిన్నెలో అందంగా అమర్చిన కదంబ పూలు
సాంద్రంగా సుగంధాలు మత్తుగా ఆవరించి
ఎంత చల్లగా , ప్రశాంతంగా ఉందో చూడూ - గూడు
వెలిగించిన కర్పూరంలా వెచ్చగా తన శ్వాస ,
జ్వలిస్తున్న రెండు నీలం నిప్పుపూలు ఆ కళ్ళు ..
కోటి సూర్యుళ్ళను వంట్లో పోదువుకున్నట్టు
వేసవి మధ్యాహ్నపు ఎండలా తన శరీరం
కొద్దిగా తెరిచిన కిటికీ తెరల నుంచీ
సరస్సుల మీదగా ఎగిరొచ్చిన పల్చని గాలి
గుత్తులుగా విరిసిన గులాబీల మీద మంచు తుంపర
పచ్చిక మీద వాలిన పావురం కళ్ళల్లో నీలి తెర
కన్నా ..
లే , లేచి కొద్దిగా అన్నం తిను..
~ సవ్వడి ~
అప్పుడేమో
చెప్పాల్సిందేవీ లేకపోయినా 
జలపాతం దుమికినట్టు గలగలా
గాలికి కదిలే ఆకుల సవ్వడిలా
బోలు బోలుగా రాలి పడిన మాటలు
ఇప్పుడేమో
చల్లని నందివర్ధనం రేకులు విచ్చినట్టు
మసకచీకటిని వెలిగించినట్టు
స్వచ్చంగా, ఇష్టంగా, శాంతిగా
నాలుగు మాటలు మాట్లాడాలనుంది
పువ్వుల సౌరభాన్ని కప్పుకున్న చెట్టు నీడలో
తేనె మంచు ధాన్యాలను యేరుకుంటూ
పచ్చదనాన్ని వెచ్చగా మేల్కొలిపే తాధాత్మతతో
మరిప్పుడేమో
నిజంగానే
నాకు మాట్లాడాలనుంది
మరి వింటావా నువ్వూ ...