Wednesday, 16 November 2016

రాత్రి .......

ఒక పరిమళమేదో తోటంతా తిరిగిపోయింది
పువ్వులన్నీ రహస్య దేహ దూప౦లో మత్తిల్లి పోతున్నాయి

ప్రొద్దున అలా తలుపు తీసానో లేదో
ఆకుల మీద కొంటెగా నవ్వుతున్న తుషారాలు

అనంత నిరీక్షణ అనంతరం
యుగాల అతిధిని చూసిన ఆన౦దంతోనేమో
తెలవారినా దీపం కళ్ళు విపార్చి వెలుగుతుంది .

ఎదురు చూస్తుంది ...
సుషుప్తిలో స్వప్నిస్తూ

ఒక స్మృతితో ,నీకోసం

Thursday, 10 November 2016

స్వప్న కధ ......
_____________

ఈ రోజు గుమ్మం పక్కనే
నిండుగా విరబూసిన పువ్వులతో
కుండీలో లేతెరుపు గులాబీ మొక్క

ముళ్ళున్నాయని భయపడకు
మంచి గంధంతో చేసిన గూడు ఇది

సరాగాలాడే వెన్నెల నీడలతో
నెమ్మదిగా ప్రవహించే నదిని
కలలుగనే చెలిమి లోగిలిది

స్వప్న తీరాల నడుమ
అఘాధాన్ని చూసి దిగులు చెందకు

హృదయపు లోతుల్లో ఎగిసిపడే దుఖం
కాగితమై
కలమై
కవిత్వమై
జీవితమై
ఉవ్వెత్తున ఎగసే సాగరమై
ఒక మనిషై
నీకోసం
నీ మాట కోసం
ఎదురుస్తుంది ...

మరి, ఇక రా !

నిండు పౌర్ణమి
విరిసిన గులాబీ
ఎగిసిపడే సాగరం
నీకై ఎదురుచూస్తున్నాయి
దిగులు .....

మనుషుల పగటి మొహాల్లా వెలిగిపోతుంది నగరం
మబ్బుతెరల మాటున చంద్రుడు
నీలిమ నిండిన కళ్ళతో బింకగా
మరో రోజు మరలిపోతుంది

చూడు
ఊరంతా ఎలా వెచ్చని దుప్పటికింద చలికాగుతుందో

రెక్కలు ముడుచుకుని
చల్ల గాలికి వణుకుతూ
నిశ్శబ్దాన్ని కళ్ళలో పొదువుకుని
తడిచిన ఒక పావురం దిగులుగా

రాత్రిపూట కడలిలా ఉప్పగా గూడు
మరి గూడు తడిచింది
రాలిన కన్నీటితోనో
వానకి తడిచిన రెక్కలతోనో
చిట్లిన హృదయపు చెమ్మతోనో

అడవిలో రాలిన నెమలికన్నులా
ఎదురు చూస్తుంది వెన్నెల కోసం
ఇక చందమామ రాదనీ తెలియని పిచ్చి పావురం....
చాలు......

అప్పడప్పుడూ అనిపిస్తుంటుంది
అసలు ఇక్కడ ఎందుకున్నానూ అని
అప్పుడు మెరుపులా నువ్వు గుర్తొస్తావు

కొందరు కొంత స్నేహంగానే మాట్లాడతారు
ఇంకొందరు పలకరింపుగా నవ్వుతారు
ఇంకొందరు హేళన చేస్తారు
కొంతమందేమో అసలు నా ఉనికిలేనట్టు నటిస్తారు

నాకనిపిస్తుంది
ఎంతమంది నా చుట్టూ ఉన్నా వీళ్ళతో నాకేం పనని

ఎడారిలో వికసించిన పుష్పంలో
జలపాతం కింద కదిలే నాచుగడ్డిలో
పోద్దువాలే ఛాయలో
బాటపక్కనే చిర్నవ్వే గడ్డిపూలలో
చిన్న చిన్న స్పర్శలో, ద్రుక్కుల్లో
తన్మయత్వం పొందే రససిద్దులు ఎవరున్నారని

ఈ లోకానికేదో చెప్పాలని గొంతు కొట్టుకులాడుతుంది ...
అసలు నాకేం తెలుసనీ
కొన్ని పదాలూ
గుప్పెడు గుండె
అందులో పిడికెడు ప్రేమ

మాటలే అక్కరలేని ఆత్మీయతలూ
మసకచీకటిని వెలిగించే సాయంత్రాలూ
శ్రద్ధగా లిఖించుకునే ఏకాంత సమయాలూ
సరాగాలాడే సీతాకోకచిలుకలూ
కలలు కనే ఆ కళ్ళూ
ఇవి చాలు ఇక నాకు ...
నిజానికి.......

నేను కవిత్వమే రాయాలనుకున్నాను
పాల వెన్నెల్లో రాలిన పువ్వులన్నీ శ్రద్ధగా యేరుకుని
వాటిని కొన్ని పదాలుగా, అక్షరాలుగా కూర్చి
నీకివ్వాలనే అనుకున్నాను.

అంతలో పరిగెత్తుకొచ్చిన ఓ ఎలుగుబంటి
నా దోసిట్లో పువ్వులన్నీ నేలరాసింది

స్తబ్దుగా ఉన్న ఆకాశంలోని మేఘాలు
అల్లల్లాడుతూ దీపం కళ్ళలో

హృదయాలు కుళ్ళి కంపుకొట్టే బోలు గుట్టలు దాటి
నేలగిరి సానువుల్లోనో మంచు పర్వతాల మొనలపైనో
కురవాలని వెన్నెలది పిచ్చి ఆశ

అపురూపంగా దాచుకున్న నా అనురాగ మానసం
ఆరిపోకుండా చేతులు అడ్డుపెడుదువు రావూ అంటూ
పడిన ప్రతిసారి నిస్సహయంగా నీ వంక

రా ! మరి నువ్వూ
మళ్ళీ కూలిన కోటని కట్టుకుందాం.
....హృదయగానం ...
_______________

సుడిగాలై సుడులు తిరుగుతున్నచీకటి
ఘనీభవించిన నీలపు నీటి ముద్దలా కడలి

నెత్తురు వెన్నెలగా జ్వలించే వెచ్చటి మౌనం కోసం
నీలపు నిప్పురవ్వలా ఎగిసిన మంచు ముద్ద

జలతారు పరదాలవెనుక ఎర్రటి రక్తం
వేసుకునే ఊహల చలిమంట ఇది

ఆహా యే౦లేదూ,
గాయమేమీ కొత్త కాదుగా

అనాది నుంచి చిట్లిన రసహృదయాలు
ఏక కఠంతో పెట్టిన పొలికేక అది

ఎడారి వరదలో మునిగిన విషాదమది
ఘనీభవించిన సరస్సులో కన్నీటి కమలమది

మంచు జ్వాలలో ఎగిసిపడి విలపించే
నీలపు నిప్పురవ్వ విషాదమది

సుడులు తిరుగుతున్నచీకటది
ఘనీభవించిన నీలపు నీటి ముద్ద అది ...
~ నెమలీక ~

రెక్కలు కట్టుకున్న కాలం
సీతాకోక చిలుకలా అరచేతిలో వాలింది

ధారగా ఆకుపచ్చని వర్షం
తడిచిన కళ్ళల్లో ధాన్యం వాసన
అపురూపంగా దాచుకున్న నెమలీక

ఊరంతా సడి లేకుండా నిద్దరోతుంది ....

చిట్లిన మేఘంలా నిదుర నెలవంక
ఇంద్రధనస్సు చిత్రాన్ని గీస్తూ రెల్లుపొద కింద
మరి ఎవరి కోసమో ఎదురు చూస్తుంది .

దూరంగా లీలగా వినిపిస్తున్న ఆలాపన
ప్రతి పువ్వులో , గడ్డిలో, సమస్త ప్రకృతిలో
నీలో
నాలో
సంగీతం
సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని
అరచేతిలో వచ్చి వాలింది ..