Tuesday, 29 September 2015

....నీకు తెలుసుగా ...!

ప్రియ కారుమంచి ......నీకు తెలుసుగా ...!
నీకు తెలుసుగా ....!
నాకు సముద్రమంటే భయమని
కానీ దూరంగా నిలుచుని,
రాయేస్తే రింగు రింగుమని తిరిగే నీళ్ళను చూడటం భలే ఉంటుంది
నేను సృష్టించిన అలజడి కన్నార్పకుండా చూడటం భలే సరదా..!!
సముద్రం నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ,
అచ్చం ఈ మనుషులు వైరుధ్య భావాలు చూసి గగ్గోలు ఎత్తినట్టు
సముద్రం కూడా చిన్న రాయికే భయపడి సుడులు తిరుగుతుంది
మధ్యమధ్యలో ఉన్మాదపు అలలు నాపైకి ఎగిసెగిసి పడతాయి కూడా
నీకు తెలుసుగా ....!
నాకు సముద్రాన్ని చూడటమే ఇష్టం
తాకడం ఇష్టం ఉండదని ...!
ఎంతసేపు ఈ గంభీరం నటించే సముద్రాన్ని చూడనూ ....
విసుగొస్తుంది నాకు ....
అందుకే ,అందుకే మెల్లగా వచ్చి నీ గది తలుపు తడతాను
నువ్వు ఉండవని నాకు తెలుసు ..
కానీ నువ్వు నాకోసం చల్లిపోయిన అక్షరాలు గుభాలిస్తూ
స్వాగతం అంటూ చిరునవ్వులు చిలకరిస్తాయి
అలానే గోడకి చేరగిలబడి ఎంత సేపు కూర్చుంటానో
గదంతా '' మనిషి వాసన''
రాలిపడిన ఒక్కోసుమ రేకునూ ఏరుకుంటూ
ఒకచోట పేర్చుకుంటూ
మళ్ళీ చెరిపేస్తూ
అలా పసిదానిలా మారిపోయి ఎంతసేపు గడిపెస్తానో ..!
మళ్ళీ సముద్రం గుర్తొస్తుంది , పాపం అలలు కూడా
వాటి విషపు నురగలతో నన్ను తడిపెయ్యలని వాటికెంత ఆరాటమో కదా ..!
వాటిని , వాటి పిచ్చి కోరికను చూస్తే జాలేస్తుంది ..
నువ్వు నాకోసం వదిలివెళ్ళిన స్నేహ సుమాలను కొన్ని దోసిట్లో పోసుకుని
వాటితో కబుర్లాడుతూ మళ్ళీ సముద్రం దగ్గరకు వస్తాను
ఇదిగో మా పరిమళం అద్దిన పూలు మీకూ కాసిని ఇస్తున్నా
ప్రక్షాళన కండి అంటూ బుజ్జగించి సముద్రంపైకి విసిరేస్తానా ..!
మళ్ళీ దానికీ వాటిని చూసినా అలజడే ....పిచ్చి సముద్రం ....
అప్పుడు నాకు మన చలం గుర్తొస్తాడు
వేయి కాగడాలు వెలిగించి విసిరినా ఆరిపోతాయి
అంత మూర్ఖం ఈ మనుషులకు అంటూ ...నిజమే కదా ..!
అందుకే నువ్వు / నేను కాగడాలు విసరొద్దు
జ్ఞానాన్ని పూలగా మార్చి వెలుగులు నింపేద్దాం.
.............సరేనా ....కన్నా .....
.......................................ప్రియ కారుమంచి...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.