Thursday, 22 November 2012

నా సమాజం



  • ప్రియ కారుమంచి //

    గుళ్ళో దేవేరికెందుకో వేల కోట్ల నగలు?
    ఆ మెట్ల మీద బిచ్చగాళ్ళకి మాత్రం
    నిత్యం కడుపుమంటలే !!

    బిచ్చగత్తె జోలెకు కట్టిన పసిపాప నేనెవ్వరికీ ముద్దురానా?
    అని జాలిగా చూస్తున్నట్టు ఉంటుంది నాకంటికి...

    ఆ పన్నెండేళ్ళ చిరుగుల గుడ్డల చిన్నది
    రెపరెపలాడే పట్టుచీరల దగ్గర చెయ్యిచాపి పైసలు అడుక్కుంటుంటే
    పక్కనున్న తోడేళ్ళు చిరుగుల సందులను ఆకలిగా తడుముతున్నా
    అర్ధం కాని పిల్ల అసహాయత కనపడుతుంటుంది నా కంటికి...

    ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు,
    చేసిన పాపాలన్నీ పోతాయ్ అని ఆత్రపడే మనుషులను చూసి
    రోజూ గుడి అరుగుమీద డొక్క వీపుకంటుకుని
    చలికి వణుకుతున్న ముసలి అవ్వ
    నవ్వుకుంటున్నట్టు ఉంటుంది నా కంటికి...

    అమ్మా! అనుకున్న పని అయిపోయింది నీ మొక్కు తీర్చటానికి వచ్చా తల్లీ
    అన్న బిడ్డలను మొక్కుల సంగతి తరవాత,
    వచ్చే దారిలో నీ తోటి వాళ్ళ కష్టం ఒక్కటీ నీ కళ్ళబడలేదా !
    అని మూగగా అడుగుతున్నట్లు ఉంటుంది ఆ అమ్మ నా కంటికి...

    ప్రియ కారుమంచి
    16 / 10 /2012....

1 comment:

  1. ప్రియా. ఎంత అవేశం ఉందీ, ఎంత అర్ధముందీ నీ అక్షరాలలో. లోకాన్ని విశదీకరించే శక్తి ఉంది.
    చక్కగా రాసావు.

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.