నీకో విషయం చెప్పనా ..
''జీవితం స్తంభించినప్పుడే
అది అర్ధం కావడం మొదలవుతుంది''
పోగొట్టుకున్న ప్రతిదీ, విలువైనదని తోస్తుంది
అప్పటిదాకా వేసుకున్న లాభనష్టాల లెక్కలు
మంచు ముక్కల్లా కళ్ళ ముందు కరిగిపోతుంటాయి
సరిగ్గా
అప్పుడు వెతుక్కోవటం మొదలెడతావు
నిన్ను. నువ్వు
పరిగెత్తి ,
పరితపించి,
అన్వేషించి ,
మధన పడీ
జీవిత రధచక్రాల కింద నలిగీ
స్రవించిన నీలి రక్తాన్ని కలంలో నింపి,
ముద్రించటం మొదలెడతావు
అప్పుడు నీకోసం,
నీకై నీవు రాసుకునే నాలుగు ప్రేమాక్షరాలవి .....
అంధకారంలో సాగిన అన్వేషణ
రహస్య హృదయాంతరాల విషాదం
ఎవరితోనూ చెప్పుకోలేని
సంవత్సరాల మూగ వేదన
అప్పుడు అక్షరాల పాండిత్యం కాదది
నీ మనః గర్భ కుహరాలలోని నిశ్శబ్దం
భుగ భుగ మండే నెత్తుటి బుగ్గలా మారి
లావాలా నీ ముందు ఎగిసేగిసి పడుతుంది
మరి అప్పుడు అంటావు నువ్వు
పరుగు ఆగాకే, జీవితం విలువ తెలిసోచ్చిందని
'వెన్నెల' ఇంకాస్త ముందే వచ్చుంటే బావుండేదని ...
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.